జైపాల్ రెడ్డీ! చంద్రబాబుతో చేతులు ఎలా కలిపావ్, మరో కోనసీమ: హరీష్
కరీంనగర్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యాక్షన్ చేస్తోందని మంత్రి హరీష్ రావు సోమవారం నాడు ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎలా ధర్నా చేశాయో చెప్పాలన్నారు.
పాలమూరు ప్రాజెక్టు కట్టవద్దని చంద్రబాబుతో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. జైపాల్ రెడ్డి కూడా ఇప్పుడు నీతులు చెబుతున్నారని, ఆయన గురించి ప్రజలకు తెలియనిది ఏముందన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన టిడిపితో కాంగ్రెస్ పార్టీ జత కట్టిందన్నారు.

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతుల కోసం రూ.1,024 కోట్లతో గోదాములు కడుతున్నామన్నారు. మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగులు నిర్మిస్తున్నామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్‌లో ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చని తద్వారా కరీంనగర్ మరో కోనసీమగా మారుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఎవరెన్ని సమస్యలు సృష్టించినా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు ఇచ్చేందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి పులిచింతల ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో 21 గ్రామాలను ముంచి 45 టీఎంసీలతో ప్రాజెక్టును పూర్తి చేశారని, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ముంపుతో ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకుంటున్నారన్నారు. ముంపు బాధితులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పరిహారం కంటే మెరుగైనదే తమ ప్రభుత్వం ఇస్తోందన్నారు.












Click it and Unblock the Notifications