కబ్జాదారుల భరతం పడతాం: మంత్రి హరీష్‌రావు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ భూములను కబ్జాచేసి దొంగ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న వారి భరతం పడతామని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు.
సిద్దిపేట: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ భూములను కబ్జాచేసి దొంగ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న వారి భరతం పడతామని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. గురువారం రాత్రి సిద్దిపేటలో చేగుంట మండలానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 400 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రజలు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా ప్రాజెక్టులు కట్టితీరుతామని స్పష్టం చేశారు.

కొందరు పందికొక్కుల్లా మారి ప్రభుత్వ భూములకు సంబంధించి పరిహారం పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారని, వీరిపట్ల తాము కఠినంగా వుంటామని తెలిపారు. దొంగ రిజిస్ట్రేషన్లతో పరిహారం పొందిన వారి నుంచి ప్రతిపైసా కక్కిస్తామని హెచ్చరించారు.
జిల్లాలో కాళేశ్వరం ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని, ప్రజల నమ్మకాన్ని తాము నిలబెడతామని, ప్రభుత్వ పనితీరుపై నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వారికి తాము స్వాగతం పలుకుతున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications