దేవినేనికి ఐదు సార్లు ఫోన్ చేశా!: స్పందన లేదని హరీశ్ సంచలనం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసేలా ఉన్నాయి. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుందామంటూ తాను చేస్తున్న యత్నాలకు ఏపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించడం లేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఉదయం ఓ తెలుగు టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో తాము నిర్మించదలచిన ప్రాజెక్టుల విషయంలో సాగు, తాగు నీటి కోసం తాము చేస్తున్న విజ్ఞప్తులకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు వేగంగా స్పందిస్తున్నాయన్నారు.

అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను చర్చించుకుందాం రమ్మని తాను ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఐదు సార్లు స్వయంగా ఫోన్ చేశానని హరీశ్ రావు చెప్పారు.
విజయవాడ, కడప, హైదరాబాద్ ఎక్కడికి రావడానికైనా సిద్ధమేనని తాను చెప్పగా, అందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నుంచి ఎటువంటి సమాధానమే రాలేదని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు ఏపీ మంత్రులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications