సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ పర్వం మార్చి 16వ తేదీన ప్రారంభమై బడ్జెట్ చర్చలతో, అనేక కీలక బిల్లుల ఆమోదాలతో కొనసాగుతుంది. ఈరోజు శాసనసభ పర్వంలో చివరి రోజు కావడంతో నేడు తెలంగాణ శాసనసభలో తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల నివారణ బిల్లు-2026 ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు.
హేట్ స్పీచ్ బిల్లుపై మంత్రి పొన్నం ప్రభాకర్
గంగా-జమున తహజీబ్‌కు నిలయమైన తెలంగాణలో ఇటీవల డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేషపూరిత ఘటనలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులం, జాతి, భాష, లింగ భేదాల ఆధారంగా శత్రుత్వాన్ని పెంచే ఇటువంటి ప్రసంగాలు సామాజిక సామరస్యానికి మరియు ప్రజా శాంతిభద్రతలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

విద్వేష నేరాలతో సమాజంలో అసమ్మతి
సమానత్వం, గౌరవం వంటి మౌలిక రాజ్యాంగ విలువలను రక్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విద్వేష నేరాలు సమాజంలో అసమ్మతిని ప్రోత్సహిస్తున్నాయని, వీటిని అరికట్టడం ద్వారానే రాష్ట్ర పౌరులందరికీ భద్రత కల్పించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
బిల్లును వ్యతిరేకించిన బీజేపీ
అయితే తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల నివారణ బిల్లు-2026 ను బిజెపి అసెంబ్లీలో వ్యతిరేకించింది. ఈ మేరకు బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. నేరం రుజువు కాకుండానే జైలుకు పంపిస్తారా.. అని ప్రశ్నించారు.
భావ ప్రకటనా స్వేచ్చను హరించటమే అన్న బీజేపీ ఎమ్మెల్యేలు
మరో నేత పాయల్ శంకర్ మాట్లాడుతూ... ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను అణచివేసేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్టు విమర్శించారు. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చను హరించటమే అన్నారు.
భగ్గుమన్న బీఆర్ఎస్, కేటీఆర్ తీవ్ర అభ్యంతరం
మరోవైపు ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించే ఉద్దేశంతో తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు వంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్చను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా కేటీఆర్ అభివర్ణించారు. ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications