గవర్నర్‌తో హైకోర్టు సిజె: మరోసారి కెసిఆర్‌తో ఖాన్, బాబుతో వారు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు పరిణామాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి భేటీలు, విమర్శలూ ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎసిబి సమన్లు జారీ చేయవచ్చునని, తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను ఎసిబి అరెస్టు చేయవచ్చునని ప్రచారం జోరందుకుంది.
మంగళవారం ఉదయం నుంచీ జరుగుతున్న భేటీలను చూస్తుంటే ఏదో జరుగబోతుందనే అనిపిస్తోంది. కాగా, గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలు, ఓటుకు నోటు కేసులో జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఎసిబి డీజీ ఏకే ఖాన్ మంగళవారంనాడు రెండోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం కూడా సీఎంతో ఏకే ఖాన్ సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం విదితమే.

కాగా, మంగళవారం ఉదయం తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం ఎపి డిజిపి జెవి రాముడు, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారిద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గవర్నర్‌తో జరిగి భేటీ వివరాలను వారు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.
మంగళవారంనాడు చంద్రబాబు ఎపి ఉన్నతాధికారులతోనూ మంత్రులతోనూ సుదీర్ఘంగా జరిపిన చర్చల తర్వాత వాతావరణం వేడెక్కింది. హైదరాబాదులో అవసరమైతే పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటామని, తమ భద్రతను తామే చూసుకుంటామని, తమకు తెలంగాణ పోలీసుల భద్రత అవసరం లేదని మంత్రులు వాదించారు. ఇదే విషయంపై డిజిపి, సిఎస్ గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం.
హైదరాబాదుపై తమకు కూడా సంపూర్ణ హక్కులు ఉన్నాయని ఎపి మంత్రులు వాదించారు. కెసిఆర్ ప్రభుత్వం కూలడానికి అవసరమైన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఒక్కడుగు ముందుకు వేస్తే తాము రెండడుగులు ముందుకు వేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అధికారం తెలంగాణ ఎసిబికి లేదని కూడా వాదించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఉత్కంఠ చోటు చేసుకుంది. ఎప్పుడు ఎటువంటి పరిణామం చోటు చేసుకుంటుందో అనే ఆసక్తి కూడా నెలకొంది.












Click it and Unblock the Notifications