‘కేసీఆర్ వల్లే! తెలంగాణలో పుట్టే ప్రతీ బిడ్డపై రూ. 20 వేల అప్పు’
హైదరాబాద్: తెలంగాణలో పుడుతున్న ప్రతీ బిడ్డపై, పుట్టుకతోనే రూ. 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ తెలిపింది. భారతదేశంలో గుజరాత్ తర్వాత ఆదాయం మిగులు రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రూ. 61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది.
ఈ రుణాలను అధిక వడ్డీలకు తీసుకోవడంతో బడ్జెట్‌లో వడ్డీల భారం అధికం కానుందని ఫోరం అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి చెప్పారు. దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ అప్పులపై తాము సమాచార హక్కు చట్టం వినియోగించి సమాచారం పొందామని తెలిపిన ఆయన, పాలనాపరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు.
ప్రభుత్వం 9 శాతం వడ్డీతో బాండ్లను విక్రయించి రూ. 23 వేల కోట్లు, 11 శాతం వడ్డీకి రూ. 24 వేల కోట్లు రుణాల రూపంలో తెచ్చుకుందని, వీటి ప్రభావం ఇప్పటికే ప్రజలపై పడిందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 'పెట్రో' ఉత్పత్తులపై అధిక పన్నులు వేశారని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకుంటే, వడ్డీల భారం మోయక తప్పదని జస్టిస్ రెడ్డప్ప రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications