హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో వర్షాలు: పిడుగుపాటుకు ముగ్గురు మృతి
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ప్రధానంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడటంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ బేగంపేట్ ప్యారడైజ్ ప్రాంతాల్లో వాన కురిసింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాన కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల వర్షం దాటికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా, గత రెండు రోజులుగా సాయంత్రం కురుస్తున్న ఈ వానల ధాటికి వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పటం లేదు.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పిడుగులు పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు యాలా మండలం జంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మణప్పగా గుర్తించారు. మరొకరు ఇదే మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన వెంకప్ప మృతి చెందారు.
మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి ఋతుపవనాలు ఆదివారం మాల్దీవుల్లో కొంతవరకు, కోమరిన్ ప్రాంతంలో కొంత వరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం నేడు బలహీన పడిందని పేర్కొంది. ఈ క్రమంలోనే రాబోమే మూడు నుంచి ఐదురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications