ఓరుగల్లులో జోరువాన: పొంగిపొరలుతున్న వాగులు; రాకపోకలు బంద్; తాజా అప్డేట్!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచికొడుతుంది. గత రెండు రోజులుగా వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. నేడు కూడా జోరువానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఏటూరునాగారాం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి 4,85,030 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ 15 గేట్లు ఎత్తి18900 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

అన్నారం సరస్వతి బ్యారేజ్ కి లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా గత 16 రోజులుగా 9 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా తిరిగి వాటిని మళ్లీ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ కి భారీగా వరద వస్తుండడంతో 54 గేట్లు ఎత్తి 830620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ములుగు జిల్లాలోని జంపన్న వాగు, పెంకవాగు, పెద్దవాగు, పూసువాగు, జిన్నెలరేవు వాగులు, భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు, జనగామ జిల్లా గానుగపహాడు వాగులు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కాటారం నుండి మేడారం కు వెళ్ళే రహదారి మధ్యలో గల పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
ఐనవోలు మండలం నందనం గ్రామంలో ఆకేరు వాగు చెక్ డాం నిండి రాత్రి నుండి ఉధృతంగా ప్రవహిస్తుంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం 14.040 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో( 14.8 మీటర్ల ) గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నర్సంపేట డివిజన్ లోని పాకాల సరస్సు, మాధన్నపేట, రంగాయ చెరువుల్లోకి, హన్మకొండలోని భద్రకాళీ చెరువు, రామప్ప జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం పాకాల సరస్సుతో పాటు అన్ని చెరువులు జలకళతో తొణికిసలాడుతున్నాయి.
పాకాల సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 17 అడుగులకు నీరు చేరింది. మాధన్నపేట చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం 17 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 11.5 అడుగులకు చేరుకుంది. రంగాయ చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం 17 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 12.5 అడుగులకు చేరింది.












Click it and Unblock the Notifications