తెలంగాణా భారీవర్షాలు: అక్కడ రెడ్అలెర్ట్; ఉధృతంగా గోదావరి; భద్రాద్రి రామయ్య ఆలయానికి వరదగండం!!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. ఇంకా ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది . రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ లను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారయంత్రాంగం అప్రమత్తమై ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది.

క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేసింది. నేడు ఉదయం కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు కొత్తగూడెం జిల్లాలో అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, హన్మకొండ, భువనగిరి జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉధృత రూపం దాల్చింది. గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు భద్రాచలం వద్ద చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి వరదనీరు భద్రాచలం వద్ద ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
ఇక గోదావరి ఉదృతంగా ప్రవహించడంతో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ప్రస్తుతం పాపికొండలు విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఈ కారణంగా అమ్మవారి దర్శనాలను ఆలయ సిబ్బంది నిలిపివేశారు.












Click it and Unblock the Notifications