Congress: కాంగ్రెస్ ధర్నాకు హైకోర్టు అనుమతి.. కానీ..
తెలంగాణ హైకోర్టు కాంగ్రెస్ ధర్నాకు అనుమతి ఇచ్చింది. సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వారు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో పాల్గొనే వారి సంఖ్య 300 మందికి మించి ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే ఉద్వేగపూరితంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ్యొద్దని సూచించింది.
సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు అనుమతితో త్వరలో హస్తం పార్టీ ధర్నాకు పిలుపునిచ్చే అవకాశం ఉంది.

కాగా బుధవారం బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో కాంగ్రెస్ నాయకులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. దేశంలోని రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల పైన పూర్తి అవగాహన ఉండి వాటి పరిష్కారం కోసం ఆలోచించే ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ మాత్రమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలగించడానికి మార్గదర్శకాలను ఏర్పాటు చేసిందన్నారు.
సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా వాటికి పరిష్కార మార్గం చూపించే బాధ్యతయుతమైన పాత్రను కాంగ్రెస్ పోషించిందని భట్టి గుర్తు చేశారు. దేశాన్ని విచ్చినం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications