Farm House Case: ఫాంహౌస్ కేసు తీర్పు సుప్రీమే సమీక్షిస్తుంది: హైకోర్టు
ఫాంహౌస్ కేసులో డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపరాదని, సుప్రీంకోర్టు మాత్రమే సమీక్ష చేస్తుందనిహైకోర్టు సీజే తెలిపారు.
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమవుతోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టును కోరారు.

సుప్రీంకోర్టు మాత్రమే సమీక్ష చేస్తుంది
సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోర్టు పలు అంశాలను లేవనెత్తింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
దీంతో బుధవారం సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని సీజేను ఏజీ కోరారు. అయితే డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపరాదని, సుప్రీంకోర్టు మాత్రమే సమీక్ష చేస్తుందని సీజే తెలిపారు.

పైలెట్ రోహిత్ రెడ్డి
మరో వైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ 17న సుప్రీంలో విచారణకు రానుంది. 2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో తమను ప్రలోభాలకు గురి చేశారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

డిసెంబరు 26
ఆ తర్వాత ఈ కేసును ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ దర్యాప్తు సరిగా లేదని.. కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వెల్లపల్లిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారించిన సింగిల్ జడ్జి... కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డిసెంబరు 26న తీర్పు చెప్పారు.

హైకోర్టు డివిజన్ బెంచ్
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. కేసును సీబీఐకు అప్పగించొద్దంటూ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేశారు. అయితే డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసింది.












Click it and Unblock the Notifications