జగన్ దీక్ష కర్నూల్ లో.. హై టెన్షన్ హైదరాబాద్ లో..
హైదరాబాద్ : జగన్ దీక్ష సంగతేమో గానీ..! ఆయన నివాసమైన లోటస్ పాండ్ వద్ద మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా సమాచారం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్ కర్నూలులో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఇంతవరకు తెలంగాణకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయని జగన్, ప్రాజెక్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
కర్నూలు దీక్ష సందర్భంగా.. తెలంగాణను టార్గెట్ చేస్తూ మాట్లాడిన జగన్, ఏపీ తెలంగాణ మధ్య భారత్-పాకిస్తాన్ తరహా వాతావరణాన్ని చంద్రబాబు, కేసీఆర్ సృష్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యాయంగా ఏపీకి దక్కాల్సిన కృష్ణా నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతుంటే చంద్రబాబు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పాలమూరు ఎత్తి పోతల పథకం విషయంలో.. తెలంగాణ ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్న జగన్ పట్ల ముందునుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ వాదులు తాజా జగన్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దీక్షలో జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణవాదులు హైదరాబాద్ లోని జగన్ ఇంటిని ముట్టడించే అవకాశం ఉండడంతో, జగన్ నివాసమైన లోటస్ పాండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
భారీ బలగాలతో జగన్ ఇంటి ముందు మోహరించిన పోలీసులు, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications