తెలంగాణాలో రోళ్ళు పగిలే ఎండలు, గత రికార్డులు బద్దలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
తెలంగాణా నిప్పుల కుంపటిని తలపిస్తుంది. తెలంగాణాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో చాలా జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో అర్ధం అవుతుంది.
మండుతున్న ఎండలతో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నిన్న శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పలు ప్రాంతాలలో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత పదేళ్లలో ఏప్రిల్ చివరి వారంలో ఇన్ని చోట్ల ఇంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు ఎండ సమయాల్లో బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి,నల్గొండ, జగిత్యాల, వరంగల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, వచ్చే ఐదు రోజుల పాటు విపరీతంగా వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బకు ఇద్దరు మృతి.. జాగ్రత్త
గత రికార్డులను బద్దలు కొట్టి ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ఉదయం 11 గంటల దగ్గర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో తిరగకూడదని సూచిస్తున్నారు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా ఒక ప్రైవేటు ఉపాధ్యాయిని ఒక కూలి మృతి చెందారని, ఎండలను నిర్లక్ష్యం చేయకూడదని వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.












Click it and Unblock the Notifications