శివరాత్రికి ముందే భానుడి భగభగ... మార్చి నుండి జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ!
తెలుగు రాష్ట్రాలలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి ఎండ ప్రభావం కనిపిస్తే ఈ సంవత్సరం శివరాత్రి రాకముందే ఎండ మొదలైంది. శివరాత్రికి శివ శివ అంటూ చలి పోతుంది అని చెప్తారు. కానీ ఇప్పుడే చలి పోయి, భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి మండుతున్న ఎండలు ఎండాకాలం పైన జనాలకు భయాన్ని పెంచుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో భానుడి ఉగ్రరూపం
ఉదయం 8 గంటల నుంచి వేడి వాతావరణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు భానుడు భగభగ మండుతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక రాబోయే రోజులలో తెలుగు రాష్ట్రాలలో భానుడు నిప్పులు చెరుగుతాడని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుండి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నిన్న తెలంగాణలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు
నిన్న తెలంగాణ రాష్ట్రంలో 35.3° నుండి 38.2° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెంచికల్ పేటలో అత్యధికంగా 38.2° ఉష్ణోగ్రతలు, జగిత్యాల బీర్పూర్ లో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిర్మల్ జిల్లా గింగాపూర్ లో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద ముద్నూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో భానుడి ప్రతాపం మరింత పెరుగుతుందని అంటున్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ
తూర్పు, ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సమయంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నాలుగు డిగ్రీల మేర ఎక్కువగా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
గతానికి భిన్నంగా వాతావరణం
ఇక వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. గతానికి భిన్నంగా వాతావరణం తయారైంది. మరోవైపు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications