బాబోయ్ ఎండలు.. తెలంగాణలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ !
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే 2015-2024 అత్యంత వేడి దశాబ్దంగా నిలవగా.. 2010-2024 మధ్య పదేళ్లు వేడి సంవత్సరాలుగా రికార్డు సృష్టించాయి. గత ఏడాది సైతం అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. గత గణాంకాలను గమనిస్తే ఈ ఏడాది కూడా సేమ్ సీన్ రిపీట్ కానుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
ఇక తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. దీంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన ఏడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు..
ఆదిలాబాద్
నిర్మల్
మంచిర్యాల
జగిత్యాల
నిజామాబాద్
రాజన్న సిరిసిల్ల
కొమరంభీమ్ ఆసిఫాబాద్
మరోవైపు గడిచిన రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని వివరించింది. అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. రైతులు, కూలీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది.












Click it and Unblock the Notifications