దారుణం: అతనిది ఆకలి బాధ.. హోటల్ సిబ్బందికి దొంగనే భయం; ఫైనల్ గా బాధితుడు మృతి
సమాజంలో మానవత్వం రోజురోజుకీ కనుమరుగైపోతుంది. సాటి మనిషి బాధ పక్కన పెట్టి మనకు మనం ఎంజాయ్ చేశామా అన్న ధోరణి పెరిగిపోతోంది. ఆకలి అన్న వాడికి పట్టెడు అన్నం పెట్టే దిక్కు లేకుండా పోతుంది. తాజాగా ఆకలి బాధను తట్టుకోలేక ఓ ఫంక్షన్లో భోజనం చేయడానికి వెళ్లిన వ్యక్తిని అక్కడ ఉన్న వాళ్ళు దొంగ అనుకుని చావ బాదడంతో ప్రాణాలు పోయిన ఘటన చోటు చేసుకుంది. అత్యంత హృదయవిదారకంగా అనిపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే

హైదరాబాద్ లో దారుణ ఘటన .. ఓ పుట్టిన రోజు వేడుకల్లో షాకింగ్ సంఘటన
తెలంగాణా రాష్ట్ర రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒరిస్సాకు చెందిన 32 సంవత్సరాల రాజేష్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ భార్య పిల్లలతో కలిసి మాదాపూర్ లో ఉంటున్నాడు. బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అతను పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మొగల్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లార్ లో ఓ పుట్టిన రోజు వేడుక జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టినరోజు వేడుకలు సిబ్బందితో కలిసి జరుపుకుంటున్నారు.

ఆకలిగా ఉంది ఆహరం కావాలన్న రాజేష్ పై హోటల్ సిబ్బంది దాడి
ఆకలితో ఉన్న రాజేష్ అక్కడ వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వాలని వారిని అడిగాడు. రాజేష్ ను చీదరించుకుని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పిన సిబ్బంది, రాజేష్ పదేపదే ఆహారం కోసం ప్రాధేయ పడడంతో అతనిపై దాడి చేశారు. విచక్షణారహితంగా చావబాదారు. వెళ్ళమని చెబితే అర్థం కాదా అంటూ విసుక్కున్నారు. ఒరిస్సాకు చెందిన వ్యక్తి కావడంతో దొంగ అని అనుమానించిన వాళ్లంతా రాజేష్ పై దాడి చేశారు. దీంతో రాజేష్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు.

సిబ్బంది దాడితో మృతి చెందిన వ్యక్తి
తరువాత అతనే లేచి వెళ్తాడు అనుకున్న హోటల్ సిబ్బంది ఎవరికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూసే సరికి కూడా రాజేష్ అక్కడే పది ఉన్నాడు. వెంటనే అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి రాజేష్ సంబంధీకులకు సమాచారం ఇవ్వగా వారు అతనిని ఇంటికి తీసుకు వెళ్లారు. ఇంటికి తీసుకు వెళ్ళిన కాసేపటికి రాజేష్ మృతిచెందాడు. రాజేష్ కు భార్య సత్యభామ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజేష్ మృతితో వారంతా కన్నీరు మున్నీరుగా రోదించారు.

కేసు నమోదు.. హోటల్ సిబ్బంది పోలీసుల అదుపులో
నిరుపేద కుటుంబం కావడంతో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో రాజేష్ భోజనం పెట్టమని అక్కడికి వెళ్లాడని, అక్కడ సిబ్బంది కొట్టడంతో తన భర్త మృతి చెందాడని భార్య సత్యభామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజేష్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే హోటల్ సిబ్బంది తాము చనిపోయే విధంగా కొట్టలేదని చెప్తున్నారు. అతని మరణానికి మరేదైనా కారణాలు ఉండొచ్చు అని అంటున్నారు.












Click it and Unblock the Notifications