పసిబిడ్డ ప్రాణాలు కాపాడేలా.. ప్రజా భవన్ లో పరిమళించిన మానవత్వం!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి, ప్రజలకు ప్రవేశం కల్పించి సమస్యలను నేరుగా ప్రజా భవన్ వేదికగా చెప్పుకునేలా, ఆ సమస్యలను అధికార యంత్రాంగం పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ఇక అప్పటినుంచి ప్రజా భవన్ కు సామాన్యులకు సైతం ఎంట్రీ దొరికింది.
ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజా భవన్ కు వెళ్లి అక్కడ అధికారులకు విన్నవించుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికార యంత్రాంగం తక్షణం చర్యలను తీసుకుంటుంది. ప్రజల కష్టాలను విని, అర్థం చేసుకుని మానవత్వంతో ప్రవర్తిస్తుంది అని చెప్పే ఓ ఘటన ప్రజా భవన్ వేదికగా జరిగింది.

హైదరాబాద్ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన నాలుగు నెలల బాబుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో పలు ఆస్పత్రులలో చూపించారు. వైద్యులు బాబు గుండెకు రంధ్రం ఉన్నట్టు తేల్చారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవాలంటే రేషన్ కార్డులో బిడ్డ పేరు ఉండాలని, ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో తాము ఆ వైద్యం చేయించుకోలేక దిక్కుతోచని స్థితిలో ప్రజా భవన్ కు వెళ్లారు.
ప్రజా భవన్ లో నోడల్ అధికారిణి దివ్య ను కలిసిన వారు వారి సమస్యను ఆమెతో చెప్పుకున్నారు.వెంటనే స్పందించిన అధికారిణి వైద్యులకు శిశువు బాధ్యతలు అప్పగించి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి, తక్షణం చికిత్స అందించాలని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి ఆదేశాలిచ్చారు. వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ప్రజా భవన్ లో ఉన్న అంబులెన్స్ లో శిశువును తరలించారు.
ఒక సామాన్య కుటుంబం చిన్నారి వైద్యం కోసం పడుతున్న బాధను అర్థం చేసుకున్న అధికారులు మానవతా దృక్పథంతో స్పందించడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారికి వైద్యం అందించడానికి ప్రభుత్వం స్పందించడం పట్ల నాలుగు నెలల చిన్నారి తల్లి సునీత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications