భార్య భోజనం పెట్టలేదని గ్రామం మొత్తానికి షాక్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే ?
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన స్థానికులను నివ్వెరపరిచింది. తన భార్యతో జరిగిన చిన్నపాటి గొడవతో అలిగిన ఓ భర్త, ఏకంగా హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి నానా హంగామా సృష్టించాడు. ఈ ఊహించని పరిణామం సుమారు రెండు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..?
జిల్లాలోని సిరికొండ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి తన భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో భార్య అతనికి భోజనం పెట్టేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమన్, మద్యం సేవించి గ్రామ శివార్లలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు.

అయితే సుమన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కుతుండటాన్ని చూసిన స్థానికులు వెంటనే ప్రమాదాన్ని పసిగట్టారు. ఆయన హైటెన్షన్ వైర్లను పట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
సుమన్ మాత్రం స్తంభం పైనుంచి కిందకు దిగడానికి ఎంతమాత్రం అంగీకరించలేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. స్తంభం మధ్యభాగంలో కూర్చుండిపోవడంతో.. కిందకు దిగాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరారు. కానీ ఎవరైనా తన దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే, అక్కడి నుంచే కిందకు దూకేస్తానని గట్టిగా బెదిరించాడు. దాదాపు రెండు గంటల పాటు కోమన్‌పల్లిలో ఈ హైడ్రామా కొనసాగింది. గంటలు గడుస్తున్నా సుమన్ కిందకు రాకపోవడం, పైగా దూకేస్తానని బెదిరించడంతో గ్రామ పెద్దలు సిరికొండ పోలీసులకు సమాచారం అందించారు.
ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సుమన్‌కు శాంతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీ సమస్యను పరిష్కరిస్తాం, ఇంకోసారి నీ భార్య నీకు భోజనం పెడుతుంది" అంటూ భరోసా ఇచ్చారు. చివరికి పోలీసులు, కుటుంబ సభ్యుల మాటలతో సుమన్ విద్యుత్ స్తంభం పైనుంచి సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చివరకు భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సున్నితంగా సమస్యను పరిష్కరించారు పోలీసులు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఏం కాకపోవడంతో బాగానే ఉంది కానీ ఏదైనా జరిగి ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని హితబోధ చేస్తున్నరు. క్షణికావేశంలో చేసే కొన్ని పిచ్చి పనులు ఇకనైనా మానుకోవాలని పిలుపునిస్తున్నారు.












Click it and Unblock the Notifications