హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనతో గులాబీల జోష్, మంత్రి హరీష్ రావు బైక్ ర్యాలీ ; ఓయూలో సంబరాలు
హుజురాబాద్ లో రాజకీయం ఊపందుకుంది. హుజురాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుండి టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఖరారు చేయడంతో పార్టీ శ్రేణులలో జోష్ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఈటల రాజేందర్ పై ఎన్నికల బరిలోకి దింపడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక రంగంలోకి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను దింపడం వ్యూహాత్మక నిర్ణయమని పార్టీ శ్రేణుల్లో, రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రంగంలోకి దిగిన హరీష్ రావు .. హుజురాబాద్ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ
ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే హుజురాబాద్ ను టీఆర్ఎస్ ఖాతాలో వెయ్యటానికి హరీష్ రావు వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఇక రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అభ్యర్థిని ప్రకటించి అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ బాగా పెరిగినట్లుగా కనిపిస్తుంది.
మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లతో కలిసి హరీష్ ర్యాలీ
ఇంతకాలం తెరవెనుక వ్యూహాలు రచించిన హరీష్ రావు, ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఈరోజు అభ్యర్థిని ప్రకటించడం, ఇదే సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో హరీష్ రావు బైక్ ర్యాలీ నిర్వహించటం టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ ర్యాలీ నిర్వహించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లతో కలిసి నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

హరీష్ రావుకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు ర్యాలీకి పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది . కె సి క్యాంప్ నుంచి జమ్మికుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన హరీష్ రావు, హుజురాబాద్ చౌరస్తాలో ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ చేశారు .పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీసీ నాయకుడు, స్థానికంగా పట్టున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

హుజురాబాద్ లోనూ, ఓయూ క్యాంపస్ లోనూ సంబరాలు
టపాసులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో గొల్ల కురుమ సంఘాలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి నేత గెలుపు శ్రీనివాస్ యాదవ్ ను ఖరారు చేయడంతో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కీలకంగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ఈటల రాజేందర్ తో కలిసి ముందుకు సాగారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఈటల రాజేందర్ ను దీటుగా ఎదుర్కొనే యువ విద్యార్థి నాయకుడు రంగంలోకి దింపారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications