హుజురాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓటింగ్; ఎవరి కొంప ముంచుతుందో? నేతల్లో టెన్షన్!!
హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి దృష్టి హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పైనే ఉంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ, ఈ ఎన్నికల విజయం ద్వారా సీఎం కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని ఈటల రాజేందర్ హోరాహోరీగా ఉప ఎన్నికల పోరులో తలపడ్డారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అటు టిఆర్ఎస్ పార్టీని ఇటు బిజెపి ని టార్గెట్ చేస్తూ ఎన్నికల బరిలోకి దిగింది.
పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు
రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిసారించిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెర తీశాయి. పెద్ద ఎత్తున హుజూరాబాద్ నియోజకవర్గం లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి డబ్బులను వెదజల్లుతున్నాయి. ఈ డబ్బుల పంపిణీ నియోజక వర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక హుజురాబాద్ ప్రజలు సైతం డబ్బుల కోసం వింత ఆందోళనలకు దిగారు. కొందరికి ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వకుంటే ఎలా అంటూ రోడ్డెక్కారు. ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

హుజురాబాద్ లో గెలుపుపై ఎవరి టెన్షన్ వారిదే
ఇదిలా ఉంటే ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న దానిపై కచ్చితమైన అభిప్రాయం ఎవరూ చెప్పలేక పోతున్నారు. ముఖ్యంగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ తో గెలుస్తారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారు గుర్తును పోలిన గుర్తులు తమకు నష్టం చేస్తాయేమో అన్న అనుమానంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంతకాలం ఈటల అంటే కారు గుర్తు అని గుర్తు పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు కూడా పొరబాటున మళ్ళీ కారు గుర్తుకు ఓటేస్తారేమో అన్న అనుమానం బీజేపీ నేతలలో ఉంది.
ఓటర్ల నాడి పట్టుకోవటం కష్టమే .. సైలెంట్ ఓటింగ్ ఛాన్స్
ఇక హుజురాబాద్ ఓటర్ల నాడిని పట్టుకోవడం రాజకీయ పార్టీలకు అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికే పలు సర్వేలు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని చెబుతుంటే, మరి కొన్ని సర్వేలు టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంటున్న పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ సారి సైలెంట్ ఓటింగ్ పెద్దఎత్తున జరుగుతుందని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరికి లభిస్తుంది అన్నది పార్టీలకు పెద్ద టెన్షన్ గా మారింది. ముఖ్యంగా ప్రజల సైలెంట్ ఓటింగ్ బీజేపీకి లాభం చేకూరుస్తుందని బిజెపి తెలంగాణ రథసారథి బండి సంజయ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు.
సైలెంట్ ఓటింగ్ లాభించేది ఎవరికి ?
ఇదే సమయంలో రాష్ట్రం మొత్తం హుజరాబాద్ నియోజకవర్గం వైపే చూస్తోందని పదే పదే ప్రచారం జరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చి బీజేపీకి జనం ఓటేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో అటు అధికార పార్టీ తీరును, ప్రతిపక్ష బీజేపీ తీరును సైలెంట్ గా చూస్తున్న ఓటర్లు కచ్చితంగా రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా తీర్పు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడే చెప్పలేము అనే పరిస్థితి హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవేళ హుజూరాబాద్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరిగితే అది టీఆర్ఎస్ కంటే బిజెపికే ఎక్కువ లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మరి హుజరాబాద్ నియోజకవర్గ ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారు అనేది త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications