కొద్ది గంటల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్: అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ, భారీ బందోబస్తు
కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది. ఉపఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. కరోనా నిబంధనలు పాటించనున్నారు. అంతేగాక, భారీ బందోబస్తు మధ్య ఈ పోలింగ్ సాగనుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, 5 మండలాలు, 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా శనివారం ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చివరి అరగంటలో కరోనా బాధితులకు అవకాశం కల్పించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా 107 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బలగాలను మోహరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్న అధికారులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. ఉపఎన్నిక కోసం మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. విద్యుత్ తోపాటు సోలార్ లైట్లను ఏర్పాటు చేసి పోలింగ్ కు ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నారు.
172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని పెట్టారు. 306 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
నవంబర్ 2న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Recommended Video
గత ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంకన్నా 27 వేల మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు కూడా పెద్దయెత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications