Huzurabad politics: పాదయాత్రపై ఎవరి ప్లాన్ వారిది..ఈటల వ్యూహం ఒకటి, బీజేపీ చాణక్యం మరొకటి!!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో కొనసాగిస్తున్న పాదయాత్ర ఎవరికి లాభం చేకూరుస్తుంది అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉన్న నేతగా ఈ పాదయాత్ర ఆయనకు మైలేజ్ తీసుకువస్తుందా? రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో పట్టం కడుతుందా ? అని కొందరు ఆలోచిస్తుంటే,మరికొందరు ఈటెల రాజేందర్ పాదయాత్రతో బిజెపికి మైలేజ్ పెరుగుతుందా? పార్టీ బలోపేతం అవుతుందా? అని ఆలోచిస్తున్నారు.

వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే వ్యూహంలో ఈటల పాదయాత్ర
తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తిని వారి పల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్రను కొనసాగించనున్నారు. మొత్తం 127 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రతో రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టడమే కాకుండా ప్రజల్లో తనకున్న ఇమేజ్ ను మరింత పెంచుకోవాలన్న వ్యూహంతో ఈటల రాజేందర్ ముందుకు వెళ్తున్నారు.

ఈటల పాదయాత్రను బీజేపీ ఖాతాలో వేసుకునే యత్నం
వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి ఈ పాదయాత్ర ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు. అందుకే ఈటల రాజేందర్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో ఈటల రాజేందర్ పాదయాత్రను, బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బిజెపి ప్రజల్లో బలపడాలని ప్రయత్నిస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటలను ముందు పెట్టి పార్టీపరంగా పుంజుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.

పాదయాత్ర సాగుతున్న మండలాలలో బీజేపీ నేతల మద్దతుకు కారణం ఇదే
టిఆర్ఎస్ వ్యూహానికి అడ్డుకట్ట వేసి, నియోజకవర్గంలో తనకున్న మంచి పేరును మరింత పెంచుకునేలా, ప్రజల్లో తన పట్ల ఉన్న సానుభూతి మరింత పెరిగేలా ఈటల రాజేందర్ అడుగులు వేస్తుంటే, బిజెపి బలమైన నాయకుడు ద్వారా పార్టీ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగుతున్న మండలాలలో బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Recommended Video

ఈటెల పాదయాత్రపై ఆసక్తికర చర్చ .. లాభం ఎవరికో ?
ప్రజల కష్టాలు తెలుసుకొని, వారికోసం పనిచేసే నాయకుడిగా తనను ఆశీర్వదించాలని ప్రజా దీవెన యాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ నియోజకవర్గంలో తన పట్టు తగ్గకుండా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులలో నాయకులు ఎవరికి వారు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటంపై ఫోకస్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రజా దీవెన యాత్ర ఈటల రాజేందర్ కు లాభం చేకూరుస్తుందా ? బిజెపికి నియోజకవర్గంలో మరింత బలం పుంజుకునేలా చేస్తుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications