Huzurabad: బీఫారమ్,రూ.28లక్షలు చెక్కు-గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అందించిన సీఎం కేసీఆర్
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం(సెప్టెంబర్ 30) బీ-ఫారమ్ అందజేశారు. అలాగే ఉప ఎన్నికలో ప్రచార ఖర్చుల నిమిత్తం చెక్కు ద్వారా రూ. 28 లక్షలు అందజేశారు. ఉపఎన్నికలో తప్పక విజయం సాధిస్తావని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి తదితరులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను గెల్లు శ్రీనివాస్ యాదవ్ కలిశారు.
రెండు రోజుల క్రితమే హుజురాబాద్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ఉపఎన్నిక జరగనుండగా... నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండగా.. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉంది.ఉపఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీ మధ్యనే ఉండనుంది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఇప్పటికీ అభ్యర్థి అన్వేషణలోనే ఉన్నది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.ఆరుసార్లు హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటలకు... ఈసారి ఉపఎన్నిక పెద్ద సవాల్‌గా నిలిచింది. టీఆర్ఎస్‌ను ఓడించి ఈటల విజయం సాధిస్తే ఆయన ఇమేజ్ మరింత పెరగనుంది.ఒకవేళ ఓడితే మాత్రం బీజేపీలో ఆయన ప్రాధాన్యత కోల్పోయే అవకాశం లేకపోలేదు. అందుకే రాజీనామా చేసిన కొద్దిరోజులకే ఈటల హుజురాబాద్‌లో వాలిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకూ హుజురాబాద్‌లోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.టీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా... ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలంతా తన వెంటే ఉన్నారని ఈటల ధీమాగా చెబుతున్నారు. ఇది కేవలం ఒక ఉపఎన్నిక మాత్రమే కాదని... ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధమని... తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలను మలుపు తిప్పే ఉపఎన్నిక అని చెబుతున్నారు.
Recommended Video
మరోవైపు ఈటలపై అభ్యర్థి కోసం తీవ్ర తర్జనభర్జన పడిన టీఆర్ఎస్.. చివరకు విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. స్థానికుడు,ఉద్యమకారుడు,బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఈటలను గెల్లు ఢీకొట్టగలడని టీఆర్ఎస్ భావిస్తోంది. గెల్లు శ్రీనివాస్ తరుపున మంత్రి హరీశ్ రావు,ఇతర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక లక్ష్యంగా కేసీఆర్ దళిత బంధు పథకాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంతో ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పొందవచ్చునని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే టీఆర్ఎస్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. పార్టీలో,ప్రభుత్వంలో అన్ని విధాలా సముచిత స్థానం కల్పించినప్పటికీ ఈటల రాజేందర్ సొంత పార్టీ పైనే కుట్రపూరితంగా వ్యవహరించారని టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్‌లో ఈటలను గెలిపిస్తే ఆయనకు లాభం తప్ప నియోజకవర్గానికి ఒరిగిదేమీ ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఈటలను గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓడించడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న హుజురాబాద్ ఓటరు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications