చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్న కోవిడ్ రోగులు..ఆ ఆస్పత్రి నుంచి 88 మంది...ఎందుకిలా జరుగుతోంది
హైదరాబాద్‌లో కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి 88 మంది రోగులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్టులు రాకుండానే వీరంతా బయటకు వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఈ రోగులకు సంబంధించి ఆస్పత్రి వద్ద సరైన వివరాలు కూడా లేవని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడటం,సెక్యూరిటీ సరిగా లేకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి.మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.

ఆ 88 మంది...
ప్రస్తుతం హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రి,కింగ్ కోఠి ఆస్పత్రి,టిమ్స్‌లలో కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కింగ్‌కోఠి ఆస్పత్రిలో
14,664 మంది కోవిడ్ టెస్టుల కోసం వచ్చారు. వీరిలో 1802 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరిలో 261 మంది మృతి చెందగా 782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 671 మంది రోగులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే మిగతా 88 మంది రోగుల వివరాలు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి.

ఎందుకిలా జరుగుతోంది...
ఆ 88 మంది కోవిడ్ రోగులు వ్యాధి నుంచి కోలుకోకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్ట్ లేకుండానే వీరు బయటకు వెళ్లడం కలకలం రేపుతోంది. ఆస్పత్రి వర్గాల వద్ద కూడా వీరికి సంబంధించి సరైన వివరాలేవీ లేవని తెలుస్తోంది. కోవిడ్ రోగులు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడానికి సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. పేషెంట్లకు ట్యాగ్స్ వేయడం,వారి సహాయకులకు పాస్‌లు ఇవ్వడం వంటి చర్యల్లో నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు.

ఖండించిన సూపరింటెండెంట్
కింగ్ కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాజేంద్రనాథ్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. ఆ 88 మంది రోగులు వేరే ఆస్పత్రులకు వెళ్తున్నామని తమకు సమాచారమిచ్చాకే ఇక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఎవరైనా చెప్పకుండా వెళ్లిపోతే వెంటనే పోలీసులకు సమాచారమిస్తున్నామని చెప్పారు. కోవిడ్ రోగులు బయటకు వెళ్లకుండా సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని... చాలామంది రోగులు కోలుకుని డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications