Video:బొమ్మలతో రామాయణం..హైదరాబాద్ మహిళ వినూత్న ప్రయత్నం..!!
రామాయణం.. మహా అద్భుతం. ఎవరు చెప్పినా.. ఎన్నిసార్లు విన్నా... అనుక్షణం పరివశించిపోయే మహా ఇతిహాసం. చరిత్రను ఎవరు ఎలా వివరించినా ..... రామాయణం చెప్పే సూత్రం మాత్రం స్పష్టంగా అవగతం అవుతుంది. పెద్దలను గౌరవించడం, ప్రజల్ని సంతోషంగా చూసుకోవడం, అధర్మాన్ని సంహరించడం, అన్న కోసం అడుగులో అడుగు వేయడం.. భర్త ఎక్కడుంటే అక్కడే తన నివాసం అని సీతమ్మ ప్రయాణించడం.. దశకంటుడుని సంహరించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఘట్టం ఒక్కో అద్భుతం.. అమోఘం.. అనిర్వచనీయం. అంతటి మహా చరిత్రను నాటకాలు, సినిమాలు, గ్రంధాలు, డాక్యుమెంటరీల రూపంలో చాలా మందే మన ముందు ఉంచారు.
సంక్రాంతి వస్తే తెలుగు రాష్ట్రాల్లో హరిదాసులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, కోడి పందాలు, గుండాటలు ఇలా చెప్పుకుంటూ పోతే మూడ్రోజుల పండుగ ఏడాది పాటంతా జ్ఞాపకముండే ఎన్నో మధురస్మృతులను మన ముందు ఉంచుతుంది. అయితే ఈ సంక్రాంతికి రామాయణాన్ని బొమ్మల కొలువుల రూపంలో మన ముందుకు తీసుకువచ్చారు హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ కు చెందిన కల్యాణం రాధిక. శ్రీరాముడి జననం దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ను బొమ్మల రూపంలో వారి ఇంట్లో ఏర్పాటు చేశారు. శ్రీరాం టవర్స్ లో ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువు చూసేందుకు అపార్ట్‌మెంట్ వాసులు క్యూ కట్టారు. రాధికలో ఇంత టాలెంట్ ఉందని తమకు తెలియదని.. ఇంత కాలం రాధిక కూడా తమ లాంటి గృహిణీ అనే అనుకున్నామని అంటున్నారు.

భావితరాలకు మన చరిత్రలు తెలియాలి
ఈ సందర్భంగా రాధిక వన్ ఇండియాతో మాట్లాడారు. తనకు చిన్నప్పటి నుంచి ఇతిహాసలపై మక్కువ అన్నారు. ప్రవచనాలు వినడం ద్వారా తాను స్పూర్తి పొందానని చెప్పుకొచ్చారు. తనకు చిన్నతనం నుంచి హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ కలెక్షన్ ఇష్టమని, అలా సేకరించిన బొమ్మలతో ఈ రోజు రామాయణాన్ని బొమ్మల కొలువు రూపంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామాయణాన్ని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. స్మార్ట్ టెక్నాలజీ ఎంత వచ్చినా.. చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపడంలో బొమ్మల కొలువులది ప్రధాన భూమిక అని తెలిపారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు తమ గురువుల సహకారంతో ఇది సాధ్యమైందని తెలిపారు.












Click it and Unblock the Notifications