వీళ్లేం సెలెబ్రిటీలు..!!
టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు బిగ్ షాక్ తగిలింది. వారి ఆస్తులు జప్తు అయ్యాయి. మొత్తం 11.14 కోట్ల రూపాయల మేర ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. వారి ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆస్తులను జప్తు చేయడానికి గల కారణాలను ఇందులో వివరించింది.
సురేష్ రైనా, శిఖర్ ధావన్.. ప్రస్తుతం మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, వాటికి సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించినందుకు వాళ్లిద్దరూ ఈడీ రాడార్ లోకి వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు వారిపై గతంలో నమోదైంది. ఇదే అంశంపై గతంలో వీరిద్దరి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు సైతం కొనసాగించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

1xBet మనీలాండరింగ్ కేసులో సురేష్ రైనా, శిఖర్ ధావన్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ యాప్ కు సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్లల్లో నటించినందుకు, ఆ తర్వాత వాటిని ప్రమోట్ చేసినందుకు ఆయా సంస్థల నుంచి మనీలాండరింగ్ రూపంలో రెమ్యునరేషన్ పొందారని నిర్ధారించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా పొందుపర్చకపోవడం, ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఈ రెమ్యునరేషన్ కు గురించి వివరించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
ఈ ఉదంతంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. వీళ్లేం సెలబ్రిటీలంటూ మండిపడ్డారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని, వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సజ్జనార్.. బెట్టింగ్ యాప్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా అని నిలదీశారు. సమాజానికి మేలు చేయడానికి, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన బాధ్యత సెలెబ్రిటీలపై ఉందని, అంతేకానీ వారిని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలను తీయకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications