ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు: ‘కార్బైడ్’ వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా కాయలను కృత్రిమ పద్ధతుల్లో పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు ప్రమాదకర కార్బైడ్ రసాయనాన్ని వాడటంపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ రసాయనం ప్రయోగించే వ్యాపారులు ఉగ్రవాదులకంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది.
‘కాల్షియం కార్బైడ్‌తో కాయల్ని పక్వానికి తేవాల్సిన అవసరం ఏముంది? సహజంగా పండే వరకు వేచి ఉన్నాకే వ్యాపారులు వాటిని విక్రయించాలి. అలా కుదరదనుకుంటే కాయల్నే అమ్మేయండి.. ప్రజలు కొనుక్కుని అవి పండాకే తింటారు. సిగరెట్లకు పండ్లకు ముడిపెట్టొద్దు' అని పండ్ల వ్యాపారుల తరపు న్యాయవాది వాదనలపై హైకోర్టు పేర్కొంది.
‘గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే మార్కెట్ పాలకవర్గం ఏం చేస్తోంది? అధికారులు కూడా వ్యాపారులకు సహకరిస్తున్నారు. అక్కడి దుకాణాలకు లైసెన్సు మంజూరుకు ఉన్న నియమ నిబంధనలేమిటి? ఎవరికి దుకాణాలిచ్చారు? ఎంత అద్దె వసూలు చేస్తున్నారు? వీటన్నింటికీ సమాధానాలతో ప్రమాణపత్రం సమర్పించండి' అని తెలంగాణ ఎస్‌జీపీకి ధర్మాసనం ఆదేశించింది.

ఉగ్రవాదులు నేరుగా వచ్చి హత్యలు చేస్తారని, కానీ, పండ్ల విక్రయదారులు విషపదార్థాలను వినియోగదారుల శరీరాల్లోకి చొప్పిస్తూ దీర్ఘకాలిక అనర్థాలకు కారణమవుతున్నారని మండిపడింది. మనిషి నాడీ వ్యవస్థపై కార్బైడ్ తీవ్ర ప్రభావం చూపుతుందని, వ్యాపారులు అత్యాశతో చేస్తున్న ఈ పని భావితరాలను బలహీనపర్చటమేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది.
విచారణలో భాగంగా మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను ధర్మాసనం గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌తోపాటు, హైదరాబాద్‌లో మరో మూడు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించిన తెలంగాణ అధికారులు, కార్బైడ్ వినియోగంపై నివేదికను బుధవారం హైకోర్టుకు సమర్పించారు.
మార్కెట్లలో సేకరించిన పండ్ల శాంపిల్స్‌ను పరీక్షించి ప్రయోగశాలలు ఇచ్చిన రిపోర్టులను కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి అందజేశారు.
ఇది ఇలా ఉండగా, కేసు విచారణ సందర్భంగా పండ్ల వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్యనాయుడు చేసిన వాదనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సిగరెట్ డబ్బాలపై పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉన్నప్పటికీ సిగరెట్లను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు కదా అని గంగయ్యనాయుడు ప్రశ్నించటంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మీరు కూడా పండ్లపై ఇవి కార్బైడ్ ఉపయోగించిన ఫలాలు అని స్టిక్కర్ వేయండి. ఎంత మంది కొంటారో చూద్దాం' అని వ్యాఖ్యానించింది.
సిగరెట్‌కు, ఫలాలకు ముడిపెట్టవద్దని హితవు పలికింది. పండ్లపై కార్బైడ్ వాడటంవల్ల జంక్‌ఫుడ్‌కు బదులుగా పండ్లను తినాలన్న నినాదాలివ్వటానికి కూడా భయపడాల్సి రావచ్చని ధర్మాసనం పేర్కొంది. కార్బైడ్ ఉపయోగంవల్ల జరిగే నష్టాలపై వివరణ ఇవ్వడానికి కోర్టు సహాయకునిగా (అమికస్ క్యూరీ) న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డిని హైకోర్టు నియమించింది.
కార్బైడ్ నిరోధానికి మార్కెట్లలో తరుచూ తనిఖీలు నిర్వహించాలని, కోర్టు ఆదేశాల కోసం వేచిచూడవద్దని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మార్కెట్ కమిటీల్లో విక్రయదారులకు ఇచ్చే లైసెన్స్ విధానాలు, అద్దెల వివరాలతో పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications