బైక్ ఆపినందుకు.. ఎస్ఐపై కత్తితో దాడి చేసిన దుండగులు
హైదరాబాద్: నగరంలో పోలీసులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల సైబరాబాద్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ పై జరిగిన దాడి మరువకముందే.. తాజాగా, ఏకంగా సబ్‌ఇన్ స్పెక్టర్ పైనే కత్తితో దాడి జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు కత్తితో దాడి చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరిని ఆపి ఎస్సై ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు తమ వద్ద ఉన్న కత్తితో ఎస్సై కడుపులో పొడిచి పరారయ్యారు.

గాయాలపాలైన ఎస్సై వినయ్ కుమార్ ను పోలీసులు గీతా నర్సింగ్ హోంకు తరలించారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ఎస్సైపై దాడికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. వారిని గుర్తించారు.
లంగర్‌హౌస్‌కు చెందిన పవన్, బాలాజీనగర్ కు చెందిన సంజయ్‌గా తేల్చారు. వీరు గతంలో పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications