హైదరాబాద్ MMTS రైళ్లల్లో ఏసీ కోచ్ లు, తొలిగా ఈ రూట్లలో - అమలు ముహూర్తం..!!
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతు న్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్‌లుగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో, 22 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న ఏసీ కోచ్‌ల కల ఇప్పుడు నెరవేరబోతుంది. రోజుకు 50 వేల మంది ఈ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఇక లోకల్ రైళ్లకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలను కలుపుతున్న లోకల్ (ఎంఎంఎటీఎస్) రైళ్లలో ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సన్నద్ధమైంది. ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ప్రవేశపెట్టిన ఏసీ లోకల్ రైళ్ల మాదిరిగా, హైదరాబాద్ మహానగరంలో నడిచే ఎంఎంఎటీఎస్ రైళ్లకు ఏసీ కోచ్‌లను జత చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని ద్వారా ఒక్కో ఎంఎంటీఎస్ కు రెండు నుంచి నాలుగు ఏసీ కోచ్ లు జత చేయనున్నారు. ఇక.. రెండో దశలో సంపూర్ణంగా కొత్త ఏసీ రైళ్లను నడిపే విధంగా కార్యాచరణ సిద్దం అయింది. ఏసీ కోచ్ లకు డిమాండ్ పెరగడంతో మూడు (ఐసీఎఫ్, ఆర్‌సీఎఫ్, ఎంసీఎఫ్) రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో వందల సంఖ్యలో లోకల్ రైళ్ల ఏసీ కోచ్‌ల తయారీకి రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. 2027 ఏప్రిల్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి
కాగా, ప్రస్తుతం ఉందానగర్ నుంచి ఆర్సీపురం వరకు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు, కాచిగూడ నుంచి మేడ్చల్ వరకు, ఘట్‌కేసర్ నుంచి లింగంపల్లి వరకు సుమారు 70 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తుండగా, ప్రతిరోజూ 60వేలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు, ఘట్‌కేసర్ నుంచి యాదాద్రివరకు ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బొల్లారం, మేడ్చల్, ఘట్‌కేసర్, ఫలక్‌నుమా వంటి మెట్రో రైలు అందుబాటులో లేని మార్గాల్లో ప్రజలు ఎంఎంటీఎస్ సేవలపైనే ఆధారపడుతున్నారు. వీరికి ఇది ఊరటనిచ్చే అంశంగా మారనుంది. మరోవైపు ఎంఎంటీఎస్ సేవలను పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించే ప్రతిపాదనల పైనా కసరత్తు జరుగుతోంది.













Click it and Unblock the Notifications