అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త... మద్యానికి బానిసై కూతురిని వేధిస్తున్నందుకు...మద్యానికి బానిసై భా
మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తిపై అతని అత్త కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... మల్కాజ్‌గిరి పరిధిలోని అడ్డగుట్ట పోచమ్మ దేవాలయం సమీపంలో దుండుగళ్ల నాని(28) అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి 2015లో మల్కాజ్‌గిరికే చెందిన సోని(26) అనే యువతితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె హాసిని ఉంది. కారు డ్రైవర్‌గా పనిచేసే నాని మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సోని 9 నెలల క్రితం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అప్పటి నుంచి పుట్టింటిలోనే ఉంటోంది. ఇదే క్రమంలో ఈ నెల 13న తన బిడ్డను చూసేందుకు నాని అత్తగారింటికి వెళ్లాడు. ఆ సమయంలో అత్త,అల్లుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అల్లుడి మాటలకు తీవ్ర కోపోద్రిక్తురాలైన అత్త కూతురి సాయంతో అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించగా... గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిహార్‌లోనూ ఇదే తరహా ఘటన :
రెండు రోజుల క్రితం బిహార్‌లోని నలంద జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కూతురిని వేధిస్తున్నందుకు ఓ వ్యక్తిపై అతని అత్త దాడికి పాల్పడింది. అందరి ముందు అతని చొక్కా పట్టుకుని నెట్టేసింది. అతన్ని తీవ్ర దుర్భాషలాడింది. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి పేరు ప్రవీణ్.2015లో వినీతా కుమారి అనే యువతితో అతనికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రవీణ్-వినీత మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదిగా మారడంతో వినీత తన తల్లిదండ్రులకు, సోదరుడికి ఫోన్ చేసి పిలిపించింది.దంపతుల మధ్య రాజీ కుదరాల్చిందిపోయి.. ఆ గొడవను వారు మరింత పెద్దది చేశారు. వినీత కుమారి తల్లి ప్రవీణ్‌తో గొడవకు దిగింది.
గ్రామస్తులందరి ముందు ప్రవీణ్ కాలర్ పట్టుకుని తోసేసింది. ప్రవీణ్‌పై నోరు పారేసుకుంది. గ్రామస్తుల ముందు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన ప్రవీణ్ వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కాసేపటికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications