Hyderabad: చల్లబడిన నగరం, పలుచోట్ల వర్షం
హైదరాబాద్: ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమవుతున్న హైదరాబాద్ నగరవాసులకు సోమవారం సాయంత్రం కురిసిన వర్షం భారీ ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ వ్యాప్తంగా మేఘావృతమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో సిటీ అంతా చల్లబడిపోయింది.
హైదరాబాద్ నగరంలోని మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. వేసవి ప్రారంభంలోనే మండే ఎండలతో బెంబేలెత్తిన నగర ప్రజలకు.. ఈ వాన కాస్త ఉపశమనం కలిగించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపుల, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ కూల్ వెదర్‌లో నగరవాసులు సేదతీరారు.

కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, ఐడీపీఎల్, షాపూర్ నగర్, జీడిమెట్లలో వర్షం కురిసింది. ఇక సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పటాన్ చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆదివారం, సోమవారం వానలు కురిశాయి.
కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జనగామ, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో మూడు నాలుగు రోజులు హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications