
క్యాన్సర్ పేషెంట్ ల కోసం హైదరాబాదీ హెయిర్ స్టైలిస్ట్ ఔదార్యం .. ఏం చేస్తున్నారంటే!
మనిషి ఎంత అందంగా ఉన్నా, నెత్తి మీద జుట్టు లేకపోతే అందవిహీనంగా కనిపిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. జుట్టు మన జీవితంలో, మన అందంపైన ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అయితే చాలామంది వివిధ కారణాలతో తమ జుట్టును కోల్పోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. వివిధ అనారోగ్య కారణాలవల్ల జుట్టు ఊడిపోతున్నవారు బయట జనాల్లో తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అటువంటి వారిలో క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లు ముఖ్యమైన వారు. క్యాన్సర్ కారణంగా జుట్టు కోల్పోయిన పేషెంట్ల ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ కి చెందిన ఒక హెయిర్ స్టైలిస్ట్. ఇంతకీ అతను క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏం చేస్తున్నాడు అంటే..

క్యాన్సర్ పేషెంట్ల జీవితంలో ఆవేదన తగ్గిస్తున్న హెయిర్ స్టైలిస్ట్
హైదరాబాద్ కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ క్యాన్సర్ కారణంగా వారు కోల్పోయిన జుట్టును, తిరిగి వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ప్రారంభించిన హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ బ్యానర్ కింద శివకుమార్ హెయిర్ డొనేషన్స్ తీసుకుని, వాటితో విగ్గులు తయారుచేసి, అవి అవసరమైన క్యాన్సర్ పేషెంట్లకు పంపుతున్నారు.

క్యాన్సర్ రోగులకు జుట్టు దానం చెయ్యమని కస్టమర్లను ప్రోత్సహిస్తున్న శివకుమార్
అంతకుముందు అనేక సెలూన్లలో పనిచేసిన శివకుమార్, తన వద్ద హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వచ్చే వారు ఇచ్చిన జుట్టు డస్ట్ బిన్ లోకి వెళ్లకుండా ఏం చేయాలన్న దానిపై ఆలోచించారు. క్యాన్సర్ రోగులకు జుట్టు దానం చేయమని ఆయన తన కస్టమర్లను ప్రోత్సహించారు. మొదట అతను విరాళంగా వచ్చిన జుట్టును ముంబై లోని ఒక సంక్షేమ సంస్థకు పంపేవాడు. అయితే ఆ తర్వాత కాకినాడకు చెందిన ఒక పేషంట్, తనకు జుట్టు కావాలని ఏదో ఒకటి చేయమని శివ కుమార్ పై ఒత్తిడి తీసుకురావడంతో శివకుమార్ పంజాగుట్టలో విగ్గులు కుట్టే వ్యక్తిని కనుగొన్నాడు.

ఇప్పటివరకు 260 మందికి విగ్గులు పంపిన శివకుమార్
అలా మొదటి విగ్గు తయారు కాగా, అప్పటినుంచి ఇప్పటివరకు శివకుమార్ దాదాపు క్యాన్సర్ తో మాత్రమే కాకుండా అలోపేసియా, ఎక్టోడెర్మల్ డైస్ప్లాసియా వంటి ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా 260 కంటే ఎక్కువ విగ్గులను దానం చేశాడు. జుట్టు ఊడిపోవడం వల్ల ఆత్మ న్యూనత భావంతో ఉండే రోగులకు విగ్గులు చేసి ఇవ్వడం వల్ల వారిలో కాస్త ఆత్మ న్యూనత భావం తగ్గుతుందని శివకుమార్ అంటున్నారు. అయితే ఒకసారి తను విగ్ పంపించిన ఒక పేషెంట్ మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు సంతాపాన్ని పోస్ట్ చేసిన సమయంలో అతనికి విగ్ పంపించినందుకు తనకు కృతజ్ఞతలు తెలుపుతూ వరకు పోస్ట్ పెట్టారని ఆయన పేర్కొన్నారు.

వృత్తి ధర్మంతో పాటు క్యాన్సర్ పేషెంట్ ల కోసం విగ్గులు కూడా
జుట్టు దానం చేసే కస్టమర్లకు విగ్గులు స్వీకరించే రోగులకు మధ్య తను వారధిగా ఉండాలని భావిస్తున్నట్టుగా శివకుమార్ తెలిపారు. తన వృత్తి ధర్మంతో పాటుగా, ప్రవృత్తిగా క్యాన్సర్ రోగులకు విగ్గులు తయారు చేసి పంపిస్తున్న హెయిర్ స్టైలిస్ట్ శివకుమార్ చేస్తున్న సేవలు తెలిసిన ప్రతి ఒక్కరు ఆయనను అభినందిస్తున్నారు. క్యాన్సర్ తో జుట్టు కోల్పోయి తమపై తమకు ఆసక్తి తగ్గిపోతున్న వారిలో ఆయన నూతన ఉత్సాహాన్ని తన విగ్గులతో నింపుతున్నారు.
హెచ్సీయూలో వివాదాస్పద మోడీ డాక్యుమెంటరీ కలకలం.. ఏబీవీపీ ఫిర్యాదుతో క్యాంపస్ లో టెన్షన్!!