హైడ్రా తరహాలో వరంగల్ లో వాడ్రా.. వాళ్లకు వెన్నులో వణుకు!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లోని అక్రమ కట్టడాల పైన ఫోకస్ చేస్తున్న హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్నటికి నిన్న అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఆక్రమణలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోరని, హైడ్రా పవర్ ఫుల్ గా పని చేస్తుందని చర్చ జరుగుతుంది.
తెలంగాణా వ్యాప్తంగా హైడ్రా ప్రకంపనలు
ఇక బఫర్ జోన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన కళాశాల నిర్మించారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్టుల భవనాల పైన ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన పైన కేసు నమోదు అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వరంగల్ లో వాడ్రా.. తెలంగాణా ప్రభుత్వ యోచన
దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో చెరువులను, ప్రభుత్వ భూములను, ఎఫ్డిఎల్ కింద ఉన్న భూములను, బఫర్ జోన్లను కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్న పెద్దలందరికీ షాకిచ్చేలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరులో కూల్చివేతలు చేయాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈ సమయంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. హైదరాబాదులో హైడ్రా తరహాలో వరంగల్లో వాడ్రా ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వాడ్రా ఏర్పాటుపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హైదరాబాద్లో ఏ విధంగా అయితే చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాల పైన కొరడా ఝుళిపిస్తుందో అదే తరహాలో వరంగల్లో వాడ్రా ఏర్పాటును చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తున్నట్టుగా ఇటీవల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం వాడ్రాపైన కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం
2020 సంవత్సరంలో వరంగల్లో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరంగల్లో మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా హైదరాబాద్ తరహాలోనే వరంగల్ లో వాడ్రా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదులోని ఆక్రమణలను కూల్చివేయాలని తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను తమ ప్రాంతాల గురించి ఆలోచించేలా చేస్తుంది.
కబ్జారాయుళ్ళ వెన్నులో వణుకు
కబ్జారాయుళ్లకు చెక్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సామాన్య మధ్య తరగతి ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంటే, ఆక్రమణలకు పాల్పడుతున్న బడా బాబులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ తరహాలో వరంగల్లో కూడా వాడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు మొదలుపెడితే గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కు చెందిన నేతల కబ్జాల బాగోతం బయటకు వస్తుందని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications