నాకే బర్త్ సర్టిఫికెట్ దిక్కులేదు.. ఇక పేదలు,దళితుల పరిస్థితేంది.. : కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. సీఏఏని వ్యతిరేకిస్తూ కచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి తీరుతామన్నారు. సీఏఏపై చర్చకు సగం రోజు కేటాయించి సభలో చర్చిద్దామన్నారు. ఇప్పటికే బీఏసీలో దానిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
తమ పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని.. వాటికి కట్టుబడే తమ రాజకీయ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు.. వాళ్ల పరిస్థితేంటి..
సీఏఏ విషయంలో దేశ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు కేసీఆర్. తాను ఒక సాధారణ పల్లెటూరులో పుట్టానని.. తనకెలాంటి బర్త్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. ఆరోజుల్లో స్థానిక పురోహితులు ఇచ్చిన జన్మనామ పత్రం తప్ప మరొకటి లేదన్నారు. ఒక ముఖ్యమంత్రినైనా తనకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే.. ఇక దళితులు,గిరిజనులు,పేదవాళ్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన బర్త్ సర్టిఫికెట్‌కే దిక్కు లేకపోతే.. ఇక తండ్రి బర్త్ సర్టిఫికెట్ ఎక్కడినుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్దమని అన్నారు. కుల,మతాలకు అతీతంగా ఉండాలన్న ప్రాథమిక సూత్రాలను సీఏఏ ఉల్లంఘిస్తోందన్నారు.

సీఏఏని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము..
ప్రజాస్వామ్యయుతమైన సమాజాలు సీఏఏ లాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవన్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలోనూ,అంతర్జాతీయంగానూ సీఏఏ విషయంలో భారత ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము ఈ దేశంలో అంతర్భాగం అని.. సీఏఏపై మాట్లాడే హక్కు తమకు ఉందని చెప్పారు. సీఏఏకి బదులు నేషనల్ ఐడెంటిటీ కార్డు లాంటిది తీసుకొస్తే బాగుంటుందని సూచించారు. అసెంబ్లీ వేదికగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్,బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సీఏఏపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని.. ప్రజలే అన్నీ గమనిస్తారని చెప్పారు.

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్..
ఇదే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగలడంతో స్పీకర్ వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనసూయ, జయప్రకాశ్ రెడ్డి, పోడెం వీరయ్య ఉన్నారు. సభ సవ్యంగా సాగేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్ లు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని ఏమాత్రం కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోలేదు. దీంతో, కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కేసీఆర్ కోరగా, సస్పెన్షన్ తీర్మానాన్ని సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెట్టారు.












Click it and Unblock the Notifications