ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ!
తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదటి వారం నుండి ఎండలు మండుతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత రోడ్ల మీదకు వెళ్లాలంటే జనం భయపడుతున్న పరిస్థితి ఉంది. అప్పుడే తీవ్రమైన ఉక్కపోతతో ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఈ జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు
భద్రాచలం, మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయని చెబుతున్నారు. భద్రాచలంలో 3.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, మహబూబ్ నగర్ లో 3.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, ఆదిలాబాద్లో 3.3 డిగ్రీలు, ఖమ్మంలో నాలుగు డిగ్రీల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
శని, ఆదివారాలలో కొన్ని జిల్లాలలో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది.
ఈ జిల్లాలలో 39.5 డిగ్రీల సెల్సియస్
మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో సైతం 39.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్రమవుతున్న ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కొన్ని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఎండల సమయంలో బయట తిరగవద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ నివారణకు తరచుగా కొబ్బరినీళ్లు, నీళ్లు, మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలని సూచన చేస్తున్నారు.
ఎండాకాలం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం
మధ్యాహ్నం 11 గంటల నుండి నాలుగు గంటల మధ్య అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే కాటన్ దుస్తులు వేసుకోవాలని. టోపీ కానీ గొడుగు కానీ సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వంటివి చేయాలని చెబుతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎండాకాలం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications