పీఎం కిసాన్ తో పాటు ఏ సంక్షేమ పథకాలు రావాలన్నా రైతులకు ఇది తప్పనిసరి!
వ్యవసాయానికి సంబంధించి, రైతాంగ సంక్షేమానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తున్నాయి. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి, వ్యవసాయ రుణాలు తీసుకోవడానికి, వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసుకోవడానికి, ఉత్పత్తుల అమ్మకాలకు రకరకాల పథకాలతో రైతుల కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఈ పంట నమోదు
ఈ పథకాలను అందుకోవాలని భావిస్తున్న రైతులు కేంద్రం చెప్పిన ఒక పనిని తప్పనిసరిగా చేయాల్సి ఉంది. వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు అన్నింటికీ ప్రామాణికమైన ఈ పంట నమోదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగాను, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోనూ ఈ పంట నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది.

ఈ పంట అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా నమోదు
రైతులు తమ పంటపొలాలలో పండించే పంట వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవడమే ఈ పంట నమోదు. కేంద్రం తీసుకువచ్చిన ఈ క్రాప్ బుకింగ్లో వ్యవసాయ అధికారుల ద్వారా రైతులు తాము పండించే పంటలను నమోదు చేయడం ప్రభుత్వ సంక్షేమపథకాల అమలుకు ముఖ్యంగా దోహదం చేస్తుంది. రైతులు తమ పంట వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా e-panta అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేయించుకోవచ్చు.
ఈ పంట నమోదు ప్రక్రియను పొడిగించిన కేంద్రం
ఈ పంట నమోదు ద్వారా పంట ఉత్పత్తుల విక్రయం తో పాటు బీమా, పంటకోత ప్రయోగాలకు ఇది కీలకంగా మారింది. ప్రస్తుతం దీనికోసం గడువును మరో మారు కేంద్రం పొడిగించింది. ఈనెల 25వ తేదీ వరకు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. డిజిటల్ ఆధారిత ఈ క్రాప్ బుకింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం రైతుల పంట స్థితిని పర్యవేక్షిస్తుంది.
పీఎం కిసాన్ వంటి పథకాలు రావాలంటే ఇది తప్పనిసరి
ఇది కేవలం పంట నమోదు ప్రక్రియ మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతకు దోహదపడే వ్యవస్థగా నిలుస్తోంది. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన వంటి పథకాల ప్రయోజనాల నుంచి, అలాగే రాష్ట్రం అందించే పలు సంక్షేమ పథకాల నుండి దూరమవుతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రైతులందరూ వెంటనే ఈ-క్రాప్ మరియు ఈ-కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసి ప్రభుత్వ సహాయాన్ని పొందాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications