ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కాంట్రాక్టర్లకు హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్!
ఇళ్ళు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణా ప్రభుత్వం ఆ దిశగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం విడతల వారీగా అందిస్తోంది. ఇలా హైదరాబాద్ మహా నగరంలో కూడా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేసి ఫ్లాట్ లను ఇవ్వనుంది.
ఆన్ లైన్ లో ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల వివరాలు
ఇప్పటికే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కోసం భారీ సంఖ్యలో ప్రజల నుండి దరఖాస్తులు రాగా, ఇళ్ళ కేటాయింపు ప్రక్రియ లాటరీ ద్వారా నిర్వహించారు. అర్హులైన వారిని లిస్టు చేసి, అందులో నుండి డ్రా ద్వారా ఇళ్ళను కేటాయించారు. ఆన్ లైన్ లో లబ్దిదారుల వివరాలు కూడా పెట్టారు. ఈ క్రమంలో అభ్యంతరాలకు, ఫిర్యాదులకు హౌసింగ్ బోర్డు అవకాశం ఇచ్చింది.

ఇందిరమ్మ టవర్స్ పనులకు తెలంగాణ ప్రభుత్వం కఠిన గడువు
హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ పనులకు తెలంగాణ ప్రభుత్వం కఠిన గడువు విధించింది. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది లోపు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు టెండర్ విలువలో ఒక శాతం ఇన్సెంటివ్ ఇస్తారు. అదే సమయంలో ఆలస్యం చేస్తే అదే ఒక శాతం జరిమానా విధిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లను 10 ప్యాకేజీలుగా విభజించి హౌసింగ్ బోర్డు టెండర్లు పిలిచింది.
ప్రీబిడ్ సమావేశానికి 18 కంపెనీలు
ఈ ప్రీబిడ్ సమావేశానికి 18 కంపెనీలు హాజరయ్యాయి. ప్రతి ప్యాకేజీ సుమారు రూ.43.20 కోట్ల విలువైనది. కొన్ని ప్యాకేజీలు రూ.86.40 కోట్లు, అత్యధికంగా రూ.129.60 కోట్ల వరకు ఉన్నాయి.
వచ్చే ఏడాది బోనాల పండుగను కొత్తగా నిర్మించే ఇందిరమ్మ టవర్ల నుంచే నిర్వహిస్తామని తెలంగాణా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించింది.
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యం
టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రతినిధులు, డ్రాలో ఫ్లాట్ దక్కిన 480 మందితో త్వరలో సమావేశం నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో డ్రా పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా లాటరీ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి రంగంలోకి దిగనున్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఈ టవర్స్ నిర్మాణాన్ని ప్రాధాన్యంగా చేపట్టింది. అందుకే నిర్మాణం చేసే కాంట్రాక్టర్ లకు కఠిన నిబంధనలు విధించింది.













Click it and Unblock the Notifications