ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఒకటి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందించడమే ఈ పథకం ఉద్దేశం. అయితే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లి పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే మేలు చేకూర్చడమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మునిసిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి పర్యటనలో 'సమీకృత భూ భారతి' పోర్టల్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ నెలాఖరులోగా రెండో విడతకు సంబంధించిన మార్గదర్శకాలు, ఎంపిక జాబితాపై అధికారులు కసరత్తు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 'ధరణి' పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. అందుకే ఆ పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపి.. పారదర్శకమైన భూ సంస్కరణల కోసం 'భూ భారతి' పోర్టల్ ను తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా భూ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ సమయంలోనే 'భూదార్' నంబర్, పక్కా కొలతలతో కూడిన మ్యాప్ లను అందిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తం సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లక్షమంది లబ్దిదారులు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ నెలలో 1, 20, 21, 30 తేదీల్లో అలాగే మే నెలలో 4, 8, 13, 14, 18, 25, 27, 28 తేదీలను ఖరారు చేసింది. దాంతోపాటు జూన్ మొదటి వారంలోనూ లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తాలను ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications