హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మొబైల్స్ స్నాచింగ్ గ్యాంగ్.. రాత్రి 10గంటల తర్వాత బయటకు వెళ్ళేవారే టార్గెట్!!
హైదరాబాద్లో మొబైల్స్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో రోడ్ల వెంట నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ చేసి వారిని మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్ మరియు నగదు చోరీ చేస్తున్న ఈ గ్యాంగ్ రాత్రి 10 దాటిన తర్వాతనే రోడ్లపై వెళుతున్న వారిని టార్గెట్ చేస్తున్నట్టు హైదరాబాద్ సీపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
1.75 కోట్ల విలువైన సెల్ఫోన్లు స్వాధీనం
ఈరోజు ఈ గ్యాంగ్ అరెస్టుకు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ముఠాకు చెందిన ఐదుగురు సుడాన్ దేశస్తుల తో సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసినట్టు మొత్తం 703 సెల్ ఫోన్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. 1.75 కోట్ల విలువైన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సముద్రమార్గంలో సెల్ ఫోన్ల రవాణా
ముఠాలో 12 మంది హైదరాబాద్ కు చెందిన వారని, మిగతా ఐదుగురు సూడాన్ దేశానికి చెందిన వారని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.ఇక చోరీ చేసిన మొబైల్స్ ను సముద్ర మార్గంలో సీ ఫుడ్స్ ముసుగులో థర్మల్ బాక్సులలో ప్యాక్ చేసి పంపిస్తున్నట్టు వెల్లడించారు. సూడాన్ వెళ్లిన సెల్ ఫోన్లను సాఫ్ట్వేర్ సహాయంతో అన్ లాక్ చేసి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
దెబ్బతిన్న సెల్ ఫోన్లు అబిడ్స్ జగదీశ్ మార్కెట్ కు
ఇక చోరీకి గురైన దెబ్బతిన్న సెల్ఫోన్లను అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. దెబ్బతిన్న ఫోన్ల లోని భాగాలను తీసి ఒరిజినల్ పార్ట్స్ గా ఎలమంద రెడ్డి అనే వ్యక్తి విక్రయిస్తున్నాడు అని దీంతో జగదీష్ మార్కెట్ పైన ప్రత్యేక నిఘా పెడుతున్నట్లుగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
విమానాశ్రయాలలో నిఘా ఎక్కువ.. అందుకే సముద్ర మార్గాల్లో
ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీష్ మార్కెట్ లో ఇటువంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేశాడని, ఇక్కడ ఐఫోన్లను కూడా ఎనిమిది వేల నుంచి అమ్ముతున్నారని వెల్లడించారు. సముద్ర మార్గం ద్వారా సూడాన్ కు సెల్ఫోన్లను తరలిస్తున్నారని పేర్కొన్నారు. విమానాశ్రయాలలో నిఘా ఎక్కువగా ఉండటంతో, సముద్ర మార్గం ద్వారా ఈ దందా జరుగుతుందని వెల్లడించారు.
చోరీ చేసిన సెల్ ఫోన్లకి కేరాఫ్ గా జగదీశ్ మార్కెట్
జగదీష్ మార్కెట్ స్నాచింగ్, చోరీ చేసిన సెల్ఫోన్ల కొనుగోలుకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, ఇక ఇటువంటి షాపులను గుర్తించి సీజ్ చేస్తామని సిపి హెచ్చరించారు. అంతేకాదు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎవరు రోడ్లమీద ఒంటరిగా తిరగకూడదని, అత్యవసరం అయితేనే ఎవరినైనా వెంటపెట్టుకుని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications