మూసివేత దిశగా హైదరాబాద్ హోటల్స్.. సంక్షోభం వెనుక కారణమిదే!
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాలుస్తున్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ వినియోగం పైన ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. గ్యాస్ కొరత ఏర్పడుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఇబ్బంది
అలాగే రైతులకు అవసరమైన ఎరువుల తయారీ కర్మాగారాలకు, పవర్ ప్లాంట్‌లకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కంటే, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఇబ్బంది ఏర్పడింది. ఇప్పటికే ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి చోట్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.

ఆందోళనలో హోటల్స్ యాజమాన్యాలు
కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా హోటల్ పరిశ్రమ బాగా దెబ్బతింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గడంతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వహణ భారంగా మారింది. అనేకచోట్ల హోటల్ యాజమాన్యాలు నిరసన తెలుపుతున్నాయి. చెన్నై హోటల్స్ అసోసియేషన్ ఈ క్రమంలో కేంద్రానికి విజ్ఞప్తి చేయగా, బెంగళూరులోని హోటల్ యాజమాన్యాలు సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఇటు ముంబైలోని దాదాపు 20 శాతం హోటళ్ళు మూతపడ్డాయి .
హైదరాబాద్ హోటల్స్ పై కమర్షియల్ గ్యాస్ కొరత ప్రభావం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కొరతకు సంబంధించిన వేడి తగులుతోంది. హైదరాబాద్లోని సుమారు 6000 హోటళ్లపై ఈ ప్రభావం పడుతుండడంతో హోటల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకపక్క రంజాన్ మాసం సీజన్ కావడంతో ఈ సమయంలో గ్యాస్ సరఫరా లేకపోతే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి చెప్పాలని హోటల్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.
సంక్షోభంలో హోటల్స్.. మూసివేత దిశగా
ప్రస్తుతం సమ్మెకు వెళ్లాలా లేదా ప్రభుత్వంతో చర్చలు జరపాలా అన్న దానిపైన తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమాలోచనలు జరుపుతోంది. ఇక ఈ సంక్షోభానికి పరిష్కారం లభించకపోతే హోటల్స్ మూతపడే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక, సేవా రంగాలు తీవ్రంగా దెబ్బ తినే పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications