ఆ ముగ్గురు మంత్రులకు షాకిచ్చి.. కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ?
తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీలో ఉన్న అసంతృప్త సీనియర్ నాయకులను, ప్రజాక్షేత్రంలో పట్టు ఉన్న నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారా? అందులో భాగంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారా? సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందా? రాష్ట్రంలో ముగ్గురు మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న కేసీఆర్ వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారా? అంటే అవును అనే బి ఆర్ ఎస్ వర్గాలలో టాక్ నడుస్తుంది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్న కేసీఆర్.. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ యోచన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అసంతృప్తులు పక్కచూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టి, ప్రజాక్షేత్రంలో పట్టు ఉన్న నాయకులకు, అసంతృప్త సీనియర్ నాయకులకు కేబినెట్లో స్థానం కల్పించాలని భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. గత ఎన్నికల తర్వాత ఒకసారి మాత్రమే సీఎం కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పరిస్థితి ఉంది.

సంక్రాంతి తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ?
ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు, అదనంగా ఆరోగ్య శాఖ కూడా కట్టబెట్టి పాలన సాగిస్తున్నారు. రెండు శాఖలు కీలకమైన శాఖలు కావడంతో హరీష్ రావుకు వీటిని నిర్వహించడం భారంగా మారుతుంది. ఈ క్రమంలో అసంతృప్తులను శాంతింప చేయడం కోసం సంక్రాంతి తర్వాత, లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముగ్గురు మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసహనం.. కొత్తవారితో రీ ప్లేస్ చేస్తారా?
అంతేకాదు ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో పనిచేస్తున్న ముగ్గురు మంత్రుల తీరుపై సీఎం కేసీఆర్ చాలా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ నుండి ఇద్దరూ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు మంత్రుల స్థానాలను కొత్త వారితో భర్తీ చేయడానికి కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారు అనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవే
ప్రధానంగా ఈ స్థానాలను భర్తీ చేయడానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలలో పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజులలో ఒకరికి క్యాబినెట్ మంత్రి హోదా దక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. అయితే వీరిలోనూ పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది.

బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ.. అసలేం జరుగుతుందో?
మొత్తానికి సంక్రాంతి తర్వాత తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పటికే పలువురు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అసలు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. నిజంగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.












Click it and Unblock the Notifications