ఏపీ, తెలంగాణాలలో మళ్ళీ ఐటీ దాడుల కలకలం: ఈసారి టార్గెట్ ఎవరంటే!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఐటీ శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన ఐటీ శాఖ, తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారవర్గాలు, రాజకీయ నాయకుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేస్తూ పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా నేడు మరో మారు ఐటీ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రియల్ ఎస్టేట్ సంస్థలపై విరుచుకుపడ్డారు.

మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం .. టార్గెట్ వారే
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లో, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో, ఆదిత్య రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధుల ఇళ్లతో పాటు, సీఎస్కే డెవలపర్స్ సంస్థకు చెందిన ప్రముఖుల కార్యాలయాలలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఆదిత్య రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన కోటారెడ్డి ఇళ్లతోపాటు, ఆ సంస్థకు చెందిన కార్యాలయాలలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, వైజాగ్, బెంగళూరులో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బిల్డర్ ఇళ్ళలో, కార్యాలయాల్లో సోదాలు
హైదరాబాద్ కు చెందిన ఓ బడా రియల్టర్, ప్రముఖ బిల్డర్ మాధవరెడ్డి నివాసంలో కూడా ఐటి సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న వ్యాపారవేత్త నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్న ఐటీ అధికారులు, మొత్తం 50 కి పైగా ప్రాంతాలలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల నివాసాలపై సోదాలు జరిపి నోటీసులు ఇచ్చి విచారణలు చేస్తూ, మరోవైపు తాజాగా మరి కొంతమందిని టార్గెట్ చేస్తూ ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.

దాడులలో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంటున్న ఐటీ
పన్ను భారీగా ఎగవేసిన అనేక వ్యాపారవేత్తలతో పాటు, హైదరాబాద్లోని పలు ఐటి కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, షాపింగ్ మాల్ యజమానులు తదితరులపై దాడులు చేసి అనేక కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్ డిస్క్ లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక దాడులలో ఆయా సంస్థలకు సంబంధించిన నిధులు వేరే కంపెనీలకు దారి మళ్ళినట్టు గుర్తించారు. ఇటీవలే ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఐటీ సోదాలు కొనసాగించిన విషయం తెలిసిందే. మొత్తం 40 కార్ లలో, 3 సిఆర్పిఎఫ్ బస్సులలో ఐటీ సిబ్బంది దాడులు చేశారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంతో పాటు, దేశ వ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు.

ఐటీ దాడులతో వ్యాపార వర్గాల్లో, రాజకీయ నేతల్లో దడ
ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటుగా, ఆయన వ్యాపార సంస్థలు, కళాశాలలపైనా ఐటి దాడులు కొనసాగాయి. అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఇళ్ళు, ఆఫీసులలో కూడా ఐటి దాడులు కొనసాగాయి. ఇక ఇటీవల వంశీ రామ్ బిల్డర్స్ పైన కూడా ఐటీ దాడులు నిర్వహించారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఐటీ దాడులు కూడా అటు వ్యాపారవర్గాలలోను, రాజకీయ వర్గాలలోనూ దడ పుట్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications