కవిత కొత్త పార్టీ ఏర్పాటు వేళ బిగ్ ట్విస్ట్, నెక్స్ట్ ఇక - నియోజకవర్గం ఫిక్స్..!!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు వేళ కీలక పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ పేరు ఖరారు చేసిన కవిత ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కాగా, కొత్త పార్టీని భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటించేందుకు కవిత ముహూర్తం ఫిక్స్ చేసారు. అదే విధంగా తాను పోటీ చేసే నియోజకవర్గం పైన కవిత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు ఖరారైంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నాడు భారీ బహిరంగ సభ ద్వారా రాజకీయంగా కొత్త లక్ష్యం ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే 'తెలంగాణ ప్రజా జాగృతి'గా తన పార్టీ పేరు ఖరారు చేసారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను ఆమె లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, తాజాగా ఢిల్లీ హైకోర్టులో కవిత పిటీషన్ దాఖలు చేసారు. ఎన్నికల సంఘం వేగంగా తమ దరఖాస్తు పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసును న్యాయస్థానం మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ ద్వారానే పోటీ చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జాగృతి బృందంతో కలిసి పార్టీ నిర్మాణ కసరత్తును ఆమె ముమ్మరం చేశారు.

పార్టీ ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో పోటీ
కవిత తన స్వచ్ఛంద సంస్థ 'తెలంగాణ జాగృతి' పేరు స్ఫూర్తితో, కొత్త పార్టీకి 'తెలంగాణ ప్రజా జాగృతి' అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక పసుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ వెంట బీసీ ఓటు బ్యాంక్ ఉండేది. ఆ ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకునేలా పసుపు టచ్ ఇస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న చర్చ. కాగా, కవిత వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తమ పార్టీకి కంచు కోటగా ఉంటూ.. ఎప్పుడు పోటీ చేసినా హరీష్ కు రికార్డు మెజార్టీ కట్టబెడుతున్న సిద్దిపేట నుంచి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారు. సిద్దిపేట లేదా కామారెడ్డి నుంచి పోటీకి కవిత ఆలోచనలు చేయగా.. సిద్దిపేట ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత పలు సందర్భాల్లో హరీష్ ను టార్గెట్ చేస్తున్న కవిత.. ఇక, నేరుగా ఎన్నికల్లోనూ హరీష్ పైనే పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications