Jagruthi : టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు కవిత ఓపెన్ ఆఫర్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో కవిత నాయకత్వంలో జాగృతి (Jagruthi) సైతం ఎన్నికల బరిలో దిగేలా నిర్ణయం తీసుకుంది. పార్టీ గుర్తు ఖరారు చేసింది. కాగా, ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కవిత ఇచ్చిన ఓపెన్ ఆఫర్ రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
జాగృతి సంస్థ రాజకీయంగా ఎంట్రీ ఇస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతోంది. ఈ సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ లో చేరనుందనే ప్రచారం పైన తీవ్రం గా స్పందించారు. తాను కాంగ్రెస్ లో ఎందుకు చేరుతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలువబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే పనిలో మహేశ్ గౌడ్ ఉన్నారని ఆరోపించారు. మహేష్ గౌడ్ తన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలని హితవు పలికారు. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కవిత పేర్కొన్నారు. మహేష్ గౌడ్ జాగృతి లో చేరాలని.. మంచి పోస్టు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చారు.

టార్గెట్ హరీష్
కాగా, మరోసారి హరీష్ రావు లక్ష్యంగా కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సృజన్ రెడ్డికి కాంట్రాక్టర్లు ఇప్పించింది ఆయన పెద్ద తిమింగలంగా మారటానికి హరీశ్‌రావునే కారణమని చెప్పారు. అదే సమయంలో సృజన్ రెడ్డి.. రేవంత్‌రెడ్డి బావమరిది అని హరీశ్‌రావుకు అప్పుడు తెలియదా అంటూ ప్రశ్నించారు. హరీశ్‌రావు తవ్విన గుంతలో మాజీ మంత్రి కేటీఆర్ పడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయనని హరీశ్‌రావు అనటం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించటమేనని చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లేఖ రాస్తానని హరీశ్‌రావు అంటున్నారని... రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా రాష్ట్రానికి సీబీఐ ఎలా వస్తుందని ప్రశ్నించారు. 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని ఆయన అంటున్నారని.. అంటే కేసీఆర్ పాలనపై కూడా హరీశ్‌రావు విచారణ కోరుతున్నట్లే కదా అంటూ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. హరీష్ రావు బాధ అంతా కమీషన్ల కోసమే అని కవిత ఆరోపించారు.












Click it and Unblock the Notifications