కర్నాటక ప్రాజెక్ట్‌లు: టిడిపికి జితేందర్, సమైక్య రాష్ట్రంలోనే గుర్తింపని టిఆర్ఎస్ ఎమ్మెల్యే!
హైదరాబాద్: కర్నాటక అక్రమ ప్రాజెక్టుల పైన తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఆదివారం అన్నారు. కర్నాటకలో కృష్ణా నది పైన అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
హైకోర్టు విభజన పైన తాము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కర్నాటకలో కృష్ణా నది పైన అక్రమ ప్రాజెక్టులు కడుతున్న విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి హరీష్ రావు కూడా మండిపడ్డారు.
సమైక్య రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉండేది: శ్రీనివాస్ గౌడ్

స్వాతంత్ర్య దినోత్సవం నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఝలక్ ఇచ్చారు. ఉద్యమ నేతగా సమైక్య రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉండేదని, కానీ, సొంత రాష్ట్రం తెలంగాణాలో కనీస గౌరవం కూడా లేదని వాపోయినట్లుగా తెలుస్తోంది.
దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తమకు తీరని అవమానం జరిగిందని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికారులు తమకు సీట్లు కేటాయించకుండా కించపరిచారన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆచార్య జయశంకర్, అమరవీరుల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. సమైక్య రాష్ట్రంలో తమకు గుర్తింపు ఉండేదని, ఉద్యమకారులు అని గౌరవం ఇచ్చేవారన్నారు. కానీ, సొంత రాష్ట్రంలో కనీస గుర్తింపు దక్కడం లేదని, జిల్లాల్లోనూ అధికారుల తీరు ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరి కారణంగా ప్రజాప్రతినిధులుగా పని చేయలేని స్థితి నెలకొందన్నారు.












Click it and Unblock the Notifications