అదే జరిగితే రూ.200 కోట్లు.. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు మహర్దశ!
రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి తెలంగాణకు ఒక ప్రత్యేక సలహా కమిటీని కేశవరావు చైర్మన్ గా నియమించింది. గత సంవత్సరం జూలైలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో సంస్కరణల కోసం మంత్రి శ్రీధర్ బాబును చైర్మన్ గా, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లను సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
నివేదికల రూపకల్పన కోసం 11గ్రూపుల ఏర్పాటు
జాతీయ విద్యా విధానం 2020లో ఉన్న అంశాలను ఏ విధంగా అమలు చేయవచ్చో నివేదించవలసిందిగా ఈ కమిటీ అధికారులను ఆదేశించింది. తాజాగా ఆ నివేదిక విడుదలైంది.మొత్తం ఈ నివేదికల రూపకల్పన కోసం 11గ్రూపులను ఏర్పాటు చేయగా ఇప్పటికే అనేక అంశాలపైన మౌలిక వసతులు, డిజిటల్ టెక్నాలజీ, సిలబస్, పరిశోధన వంటి వాటిపైన పలుమార్లు గ్రూపులు సమావేశం నిర్వహించాయి. వారంరోజుల్లో ఈ గ్రూపులు తమ నివేదికలను కమిటీ ముందు ఉంచనున్నాయి.

ఈ యూనివర్సిటీలకు మహర్దశ
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్న ఆకునూరు మురళి నేతృత్వంలో మౌలిక వసతుల గ్రూపులు పలు ఆసక్తికరమైన సిఫార్సులను చేసింది. విద్య, మౌలిక వసతులు, పరిశోధన, నవకల్పన రంగాలలో అత్యున్నత ప్రమాణాలను సాధించడం కోసం కొన్ని యూనివర్సిటీలను మోడల్ యూనివర్సిటీలుగా అప్గ్రేడ్ చేయాలని పేర్కొంది. మొదటి విడతలో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు ప్రాధాన్యతనివ్వాలని అందులో వెల్లడించింది.
అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో రెండు యూనివర్సిటీలు
ఈ రెండు యూనివర్సిటీలలో మౌలిక వసతుల కల్పన కోసం మూడు సంవత్సరాలలో 200 కోట్ల రూపాయలను కేటాయించాలని గ్రూపు ప్రతిపాదించింది. మూడు సంవత్సరాలలో ఒక్కొక్క యూనివర్సిటీకి విశ్వవిద్యాలయ మౌలిక వసతుల ఆధునీకరణ నిధి కింద 200 కోట్ల రూపాయలను కేటాయించాలని సిఫార్సు చేసింది. కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల మాదిరిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రెండు విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దాలని ప్రతిపాదించింది.
వివిధ దేశాల్లో డిజైన్స్ స్టడీ చేసి మార్చాలని సూచన
మోడల్ యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలను, కౌన్సిలింగ్ విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక యూనివర్సిటీలను తీర్చిదిద్దడానికి సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలలో ఉన్న విభిన్నమైన డిజైన్లను స్టడీ చేయాలని, విద్యార్థులకు కల్పించే వసతుల పైన అధ్యయనం చేయాలని, వాటిని రాష్ట్రంలో అమలు చేయడం కోసం ఆయా దేశాలలో పర్యటించాలని పేర్కొంది.
ప్రభుత్వ యూనివర్సిటీల చుట్టూ ప్రహరీలు
కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చుట్టూ ప్రహరీని నిర్మించాలని, యూనివర్సిటీ ఉపకులపతి చైర్మన్ గా కమిటీని వేసి మౌలిక వసతుల అభివృద్ధి చేయాలని పేర్కొంది. యూజీ, పీజీ కళాశాలలు పట్టణ ప్రాంతాలలో కనీసం మూడు ఎకరాలు, గ్రామీణ ప్రాంతాలలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications