కేసీఆర్ సర్కారుకు చరమగీతమే: బండి సంజయ్ అరెస్టుపై స్పందించిన జేపీ నడ్డా
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి లభిస్తోన్న మద్దతు చూసి కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీకి లభిస్తున్న మద్దతు చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది. మేం ప్రజాస్వామ్యయుతంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కేసీఆర్‌కు చరమగీతం పాడుతామని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎంపీ బండి సంజయ్ హక్కులను తెలంగాణ ప్రభుత్వం హరిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు వైఖరికి నిదర్శనమని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందంటూ ఆమె రాజీనామా డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామ్నూరులో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ నిరసన చేపట్టారు. దీంతో బండి సంజయ్ దీక్షను భగ్నం చేసి, ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు.
We will fight democratically and ensure that in the coming elections TRS & KCR will be wiped out.
— Jagat Prakash Nadda (@JPNadda) August 23, 2022
మరోవైపు, బండి సంజయ్ తన యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ విషయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications