అదృష్టం కలిసొచ్చింది: తెలంగాణలో రిటైర్డ్, ఏపీలో మళ్లీ ఉద్యోగం
న్యూఢిల్లీ: పదవి విరమణ పొందిన ఇరవై మందికి మళ్లీ ఉద్యోగం వచ్చింది! తెలంగాణలో 58 ఏళ్లకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఏపీ జైళ్ల శాఖలో మరో రెండేళ్ల పాటు ఉద్యోగం ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి వ్యక్తం చేసింది.
ఉద్యోగుల పంపిణీలో పలువురు ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. అయితే, కమల్ నాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం స్థానికత ఉన్నవారిని తిరిగి ఏపీకే కేటాయించారు. వారిలో పలువురు పదవీ విరమణ పొందారు.
తెలంగాణలో పదవీ విరమణ 58. ఏపీలో ఆ వయస్సు 60 ఏళ్లుగా ఉంది. దీంతో ఇరవై మంది ఉద్యోగులకు అదృష్టం కలిసి వచ్చింది.

కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల తుది కేటాయింపులు త్వరలో మొదలు కాబోతున్నాయి. తొలి విడతగా 40 శాఖల్లోని ఉద్యోగుల పేర్లతో ఈ తుది కేటాయింపు జాబితాలు ఢిల్లీ నుంచి వెలువడనున్నాయి.
40 శాఖల్లోని ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కమలనాథన్ నేతృత్వంలోని సలహా సంఘం తాజాగా ఆమోదం తెలిపింది. ఇది ఇచ్చే సిఫార్సుల ఆధారంగా తుది కేటాయింపుల జాబితా వెలువడుతుంది.
కమనలనాథన్ కమిటీతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు గురువారం భేటీ అయ్యారు. ఉద్యోగుల కేటాయింపుల అంశంపై చర్చించారు. ఉభయ రాష్ట్రాల సిఎస్‌లు వెళ్లిపోయాక రాత్రి వరకు కమలనాథన్ కమిటీ పది శాఖల్లోని ఉద్యోగుల అభ్యంతరాలను పరిశీలించారు.












Click it and Unblock the Notifications