ఒక్క టిక్కెట్ ఇవ్వరా, మీకు మేం వద్దా: కాంగ్రెస్‌పై 'కమ్మ'ల ఆగ్రహం, ఆ పదవి ఇచ్చినా..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని సెటిలర్లు, ఓ సామాజిక వర్గం ఓట్లతో లబ్ధి పొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజిక వర్గం నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్క నేత కూడా లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆరుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఆరుగురికి టిక్కెట్లు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

రేణుకా చౌదరి సహా పలువురి అసంతృప్తి
పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సహా సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పార్టీ తీరుతో నిరుత్సాహానికి లోనయ్యారు. ఒక సీటును కూడా కేటాయించకుండా తమ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని అంటున్నారు. రెండు జాబితాల్లో కలిసి ఒక్క టిక్కెట్ ఇవ్వలేదని వాపోతున్నారు.

బుజ్జగింపులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
కమ్మ సామాజికవర్గం అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా పార్టీలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నేత జెట్టి కుసుమకుమార్‌కు ఓ పదవిని ఇచ్చింది. జెట్టిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ఉన్నారు. ఇప్పుడు మరో జెట్టికి కూడా అదే పదవి కట్టబెట్టింది.

మా సామాజిక వర్గంతో పనిలేదా అని నిలదీత
దీనిపై పార్టీలోని కమ్మ సామాజిక వర్గం నేతలు సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యే టిక్కెట్లకు బదులు కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ పదవితో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి తమ సామాజిక వర్గంతో పని లేదా అని ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో అన్యాయంపై ఊరుకునేది లేదని చెబుతున్నారు.

ప్రభావితం చేసే స్థాయిలో ఓటర్లు
కాగా, హైదరాబాదుతో పాటు ఖమ్మం, నల్గొండ వంటి పలు జిల్లాల్లో ఆ సామాజిక వర్గంతో పాటు ఏపీ ఓటర్లు ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. వారికి ప్రాధాన్యం ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ హామీ ఏమయిందని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications