గులాబీ గూటికే: సీఎం కేసీఆర్‌ను కలిసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్
హైదరాబాద్: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మళ్లీ సొంత గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, గురువారం నాడు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
రానున్న రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని రవీందర్ సింగ్‌కు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా,ఇటీవల జరిగిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్‌కు రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అంతేగాక, టీఆర్ఎస్ పార్టీపై, మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు రవీందర్ సింగ్.
ఈ నేపథ్యంలో రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూడా రవీందర్ సింగ్‌కు మద్దతు తెలిపింది. అయితే, తాజాగా రవీందర్‌సింగ్ సీఎం కేసీఆర్‌ను కలవడంతో ఆయన త్వరలోనే మళ్లీ సొంత గూటికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది.

విభజన సమస్యలపై చర్చిద్దాం రండి: ఏపీ, తెలంగాణకు కేంద్రం లేఖ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అయితే, రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు ఇంకా అమలు కాలేదు. ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తున్నా.. పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు.
అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది కేంద్రం. విభజన సమస్యలపై జనవరి 12వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చింది. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో.. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను లేఖలో కోరింది.












Click it and Unblock the Notifications